ఓయో రూమ్లో యువతి అనుమానాస్పద మృతి 

ఓయో రూమ్లో యువతి అనుమానాస్పద మృతి 
  • రూమ్ గోడలు, బెడ్‌‌షీట్‌‌పై రక్తపు మరకల గుర్తింపు
  • ప్రియుడే హతమార్చి ఉంటాడని పోలీసుల అనుమానం 

మాదాపూర్, వెలుగు: మాదాపూర్‌‌లోని ఓ హోటల్‌‌లో విశాఖపట్టణానికి చెందిన యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తీవ్ర గాయాలతో ఆమెను దవాఖానకు తరలించిన ప్రియుడు అనంతరం పరారవడం, హోటల్ గది గోడలు, బెడ్‌‌పై రక్తపు మరకలు ఉండటంతో పోలీసులు దీనిని హత్యగా అనుమానిస్తున్నారు. మాదాపూర్ పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్టణానికి చెందిన షరోన్ నిఖిత టోప్నో (29) హైదరాబాద్‌‌లో ఓ ప్రైవేటు జాబ్ చేస్తోంది.

వైజాగ్‌‌కే చెందిన శ్రీనివాస రవితేజను ఆమె ప్రేమించింది. అయితే, కుటుంబ సభ్యులు వేరే వ్యక్తికిచ్చి పెండ్లి చేయడంతో, ఆమె భర్తకు విడాకులు ఇచ్చి హైదరాబాద్‌‌ వచ్చి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఒంటరిగా ఉంటోంది. సోమవారం మధ్యాహ్నం రవితేజ, నిఖిత మాదాపూర్ సిద్ధిక్‌‌నగర్ రోడ్డు నంబర్ 5లోని ఓఎస్‌‌ఎల్‌‌ఎన్‌‌ఓయూ హోటల్ రూమ్‌‌కు వెళ్లారు. అయితే, మంగళవారం తెల్లవారుజామున తీవ్ర గాయాలతో ఉన్న నిఖితను.. శ్రీనివాస రవితేజ, హోటల్ సిబ్బంది కలిసి కొత్తగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

ఆమెను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. డాక్టర్ల ద్వారా విషయం తెలిసిన వెంటనే శ్రీనివాస రవితేజ అక్కడి నుంచి పరారయ్యాడు. హాస్పిటల్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో మాదాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. నిఖిత ముఖం, తలపై తీవ్రమైన గాయాలు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

క్లూస్ టీమ్‌‌తో కలిసి హోటల్ రూమ్‌‌ను పరిశీలించగా.. గోడలు, బెడ్‌‌షీట్‌‌పై రక్తపు మరకలు కనిపించాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిఖితను ఆమె ప్రియుడే హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.